వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని పరసనంబాల గ్రామ శివారులో రైతులకు పత్తి పంటలో అంతర కృషి ప్రాముఖ్యతపై బూరుగూడ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్తి పంట విత్తిన తర్వాత తొలి 20 రోజుల దశ అత్యంత కీలకమని తెలిపారు. ఈ సమయంలో రసాయనిక కలుపు మందులు వినియోగించకుండా ఎద్దుల ద్వారా అంతర దుక్కి (నడుపు) చేయడం వల్ల కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించబడటంతో పాటు భూమిలో తేమ నిల్వ ఉండి నేల సారవంతంగా మారుతుందన్నారు. అంతర కృషి వల్ల పత్తి మొక్కలకు బలమైన వేర్ల వ్యవస్థ ఏర్పడి, పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుందని వివరించారు. రసాయనిక కలుపు మందులను అధికంగా ఉపయోగించడం వల్ల భూమి సారాన్ని కోల్పోయి చౌడుబారే ప్రమాదం ఉందని రైతులకు సూచించారు. రైతులు సేంద్రియ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించి మంచి దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చారు.
Reporter
వాస్తవ గమ్యం